అరటికాయలు కోసినప్పుడు చేతులు రంగు మారడానికి కారణం ఏమిటి?
సాధారణంగా మొక్కలు తమను తాము సూక్ష్మజీవులు, పురుగుల బారి నుంచి రక్షించుకోవడానికి అంతో ఇంతో ప్రత్యేక రసాయనాలను ఉత్పత్తి చేసుకుంటాయి. అలా అరటి కాయ తన లోపల ఎన్నో రక్షక రసాయనాలను (preservatives) సహజంగానే సంతరించుకుని ఉంటుంది. ఇందులో ఫినాలు తరహా రసాయనాలు, ఇనుము, కాపర్ లవణాలు ఉంటాయి. మనం అరటికాయ పచ్చని తోలును చీల్చినప్పుడు అందులోంచి ఈ రసాయనాలు కొంచెం జిగురుగా రావడాన్ని గమనించవచ్చు. ఇవి మన చేతులకు కానీ, బట్టలకు కానీ అంటుకుంటూనే బయటి వాతావరణానికి బహిర్గతమవుతాయి. వెంటనే ఇవి గాలిలోని ఆక్సిజన్‌తో కలిసి ఆక్సీకరణం(oxidise) చెందుతాయి.
ఉదాహరణకు ఫినాళ్లు ఆక్సీకరణం చెందితే అవి క్వినోన్లు అనే పదార్థాలుగా మారతాయి. అలాగే లోహ లవణాలు (metal salts) కొన్ని వాటి ఆక్సైడులుగా మారతాయి. ఫినాళ్లకు దాదాపు రంగు ఉండదు. కానీ క్వినోన్లకు ముదురు రంగులు ఉంటాయి. అరటి తొక్క జిగురు చేతికి అంటుకున్నప్పుడు అందులోని ఫినాళ్లు గాలిలోని ఆక్సిజన్ సమక్షంలో రంగుగల క్వినోన్లుగా మారడం వల్లనే మచ్చలు (కర్రులు) ఏర్పడుతాయి.
Powered by W3Teacher
No comments
Post a Comment